#వంగవీటి ‘కాపు’ కాసే శక్తి మాత్రమేనా!
.
#must_read :-
http://www.vlrlive.com/2016/12/vangaveeti-mohana-ranga.html
 

    విజయవాడలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న కమ్యూనిస్టులతో పోరాడుతూ అక్టోబర్  28, 1974లో వంగవీటి రాధ హత్యకు గురయ్యాడు. దాంతో తన అన్నను నమ్ముకున్న వ్యక్తుల బాధ్యతలను భుజానకెత్తుకున్నారు మోహనరంగ. అంతేకాదు,  తన అన్నను అంతమొందించిన ప్రత్యర్థులను ప్రతిఘటిస్తూ,  అప్పటికే అన్నకు శ్రేయోభిలాషులుగా,  సహచరులుగా ఉన్న వ్యక్తుల ఆత్మీయ సహకారంతో,  విద్యార్థి,  కార్మిక సంఘాలకు నాయకత్వం వహించారు. 1981లో జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో జైలులో ఉండి  41 వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది,  ప్రత్యక్ష రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తదనంతర కాలంలో జాతీయ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుని,  ఆ పార్టీ నాయకుడిగా గుర్తింపు పొంది,  స్వర్గీయ వై.యస్. రాజశేఖర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో నగర కాంగ్రెస్ ప్రెసిండెంట్ గా నియమితులయ్యారు.
    1983  సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వంగవీటి మోహన రంగ ప్రజా పక్ష పోరాటాలు అధికమయ్యాయి. శాంతి భద్రతల పరిరక్షణ సాకుతో ప్రభుత్వం ప్రవేశ పెట్టాలనుకున్న  ‘పోలీస్ బిల్’కు వ్యతిరేకంగా వివిధ ప్రజా సంఘాలతో కలిసి రంగ పలు కార్యక్రమాలు నిర్వహించారు. తాను ఉన్నత విద్యను అభ్యసించలేకపోయాననే బాధ ఆయనలో చాలా ఉండేది. అందుకనే చదువుకోవాలనే ఆకాంక్షతో తన వద్దకు వచ్చిన వారికి మాట సాయమే కాదు,  ఆర్థిక సాయం కూడా రంగ చేశారు. ఒక సందర్భంలో డేవిడ్ అనే విద్యార్థి ఫీజు కట్టడానికి తన చేతికి ఉన్న వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని తాకట్టు పెట్టి మరీ రంగ ఆర్థిక సాయం చేశారని ఆయన తొలినాటి సహచరులు గుర్తు చేసుకుంటూ ఉంటారు.
వంగవీటి మోహనరంగా కన్నుమూసి    ఇరవై ఎనిమిదేళ్ళు అయ్యింది. ఓ సాధారణ శాసన సభ్యుడు,  అదీ కేవలం మూడేళ్ళు మాత్రమే ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఇప్పటికీ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని,  లక్షలాది మందికి నిత్య స్మరణీయునిగా ఉన్నారంటే సామాన్య విషయం కాదు. ఆయన   ప్రజా బాహుళ్యంలో తేలికగా ప్రచారం అందుకునే సినీ నటుడు కాదు,  క్రికెట్ స్టార్ అంత కంటే కాదు. కేవలం తన ప్రాంత ప్రజలతో నిత్యం సత్ సంబంధాలు కలిగిన సాహసోపేతమైన నాయకుడు. అందుకే ఇప్పటికీ ప్రజల నీరాజనాలు అందుకుంటున్నారు.
  ఇరవై ఎనిమిదేళ్ళ క్రితం 1988 డిసెంబర్ 26వ తేదీ తెల్లవారు ఝామున వంగవీటి మోహన రంగ బెజవాడ నడిబొడ్డున హత్య కావించబడ్డారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘వంగవీటి’ పేరుతో సినిమా రూపొందించారు. ‘కాపు కాసే శక్తి’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. బడుగు, బలహీన వర్గాల కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రజానాయకుడు రంగాపై ఒక కుల నాయకుడనే ముద్ర వేయడం ఎంతోకాలంగా జరుగుతోంది. ‘వంగవీటి’ చిత్రం సైతం అందుకు మినహాయింపు కాదు. రంగ వర్థంతికి సరిగ్గా మూడు రోజుల ముందు ఈ సినిమా విడుదలైంది. నాస్తికుడైన రాంగోపాల్ వర్మ.. రంగ హత్య వెనక ఎవరు ఉన్నారు? అందుకు కారణాలేమిటనేది? ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గమ్మకు తెలుసని కానీ ఆవిడ నోరు విప్పదని చెప్పి కప్పదాటు వేయడం హాస్యాస్పందం. వర్మ పేర్కొన్నట్టు వంగవీటి రంగ కేవలం ‘కాపు’ కాసిన వ్యక్తి మాత్రమేనా… మరుగు పరచలేని ఆయనలోని మరో కోణమేమిటి…
హక్కుల పోరాట యోధుడు
వంగవీటి మోహన రంగలో హక్కుల పోరాట యోధుడు ఉన్నాడు. అందుకు అనేక ఉదాహరణలను చెప్పుకోవచ్చు. సంచలన,  పరిశోధనాత్మక జర్నలిజంతో నిజాలను నిర్భీతిగా వెలుగులోకి తెచ్చిన  ‘ఎన్ కౌంటర్’  పత్రిక సంపాదకుడు పింగళి దశరథ్ రామ్  1985  అక్టోబర్  21న అతి కిరాతకంగా హత్యకు గురయ్యాడు. అది రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్భలంతో,  పోలీసుల ప్రోత్సాహక హత్యగా రంగ భావించారు. దానికి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి ఆయన పోరాటం చేశారు. అలానే  1986లో విజయవాడ ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అదుపులోకి తీసుకున్న నేవీ ఆఫీసర్ టి. మురళీధర్ ఆ తర్వాత అనూహ్యంగా రైల్వే ట్రాక్ పై నిర్జీవంగా దర్శనమిచ్చాడు. ఆ కేసును మాఫీ చేయడానికి రాజ్యం (పోలీస్) చేసిన ప్రతి ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తూ,  వివిధ హక్కుల సంఘాల మార్గదర్శకత్వంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేశారు రంగ. ఫలితంగా దోషులపై కేసు నమోదైంది. రంగ మరణానంతరం  1994లో కేసును విచారించిన విజయవాడ సెషన్స్ జడ్జి ఒక ఎస్.ఐ.,  ఐదుగురు పోలీసులకు జీవిత ఖైదు విధించారు. అలానే రాజకీయ రాజధానిగా పేరొందిన విజయవాడలో ఖాకీలు తమ కౌర్యంతో ముదిగొండ పద్మ అనే మహిళను నేరారోపణపై అదుపులోకి తీసుకుని శిరోముండనం చేశారు. ఈ వార్త తెలిసిన రంగ సంబంధిత పోలీస్ స్టేషన్ ఎదురుగానే పెద్ద సంఖ్యలో ప్రజలతో కలిసి ఆందోళన చేశారు. బాధ్యులైన పోలీసు అధికారులపై డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకునే వరకూ ఆయన విశ్రమించలేదు.  1987  నవంబర్   30న మల్లెల బాబ్జీ అనే వ్యక్తి విజయవాడ శ్రీ దుర్గా లాడ్జి లో అనుమానాస్పద స్థితిలో మరణించగా, సదరు వ్యక్తి గతంలో 1984 జనవరి 9న లాల్ బహదూర్ స్టేడియంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీయార్ ఫై హత్యాప్రయత్నం చేసిన కేసులో దోషి కావడం, తదనంతర పరిస్థితులలో ఈ విధంగా మరణించడం ఫై సమగ్ర విచారణ జరపవల్సిందేనని అసెంబ్లీలో పట్టుపట్టారు. రంగాకు సమాధానం చెప్పలేక విధి లేని పరిస్థితులలో అప్పటి ప్రభుత్వం జస్టిస్ శ్రీ రాములు కమిటీని వేసింది. ఆ కమిటీ   ఎన్టీయార్ పై జరిగిన దాడిని సందేహిస్తూ అది చంద్రబాబునాయుడు రచనతో జరిగిన హై డ్రామాగా రిపోర్ట్ నిచ్చింది. తన అన్నయ్య స్వర్గీయ రాధ కాలం నుండి విజయదశమి రోజుల్లో జరిగే దూపాటి నరసన్న తదితరుల ప్రభల ఊరేగింపును పోలీసులు నిషేధించినప్పుడూ రంగ ఆమరణ నిరాహారదీక్ష చేసి,  ప్రజా ఉద్యమాన్ని రగిల్చారు.  అదే సమయంలో న్యాయపోరాటం చేసి,  హైకోర్టు నుండి ప్రభల ఊరేగింపుకు అనుమతి సంపాదించారు. అప్పటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కోనేరు రంగారావుతో సహా అనేకమంది నేతలు ఆ వేడుకలో పాల్గొన్నారు.
కులాతీత రాజకీయ ప్రస్థానం
రంగ తన రాజకీయ జీవితంలో చాలా దూరదృష్టితో కులరహితంగా అందరినీ కలుపుకునే విధంగానే నిర్ణయాలు తీసుకున్నారన్నది వాస్తవం.  1987  విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయానికి అప్పటికే శాసన సభ్యుడిగా ఉన్న రంగ,  ఎన్నికల బాధ్యతను తన భుజానకెత్తుకున్నారు. మేయర్ పదవిపై అనేకమంది కాపు నాయకులు ఆశలు పెట్టుకున్నా…  పేదల డాక్టర్ గా పేరొందిన జంధ్యాల దక్షిణామూర్తి గారి కుమారుడు,  మేధావి జంధ్యాల శంకర్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. తదనంతర కాలంలో రాజకీయాలకు అతీతంగా విజయవాడ అభివృద్ధికి జంధ్యాల శంకర్ పాటుపడిన విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో డిప్యూటీ మేయర్ గా దళిత నాయకుడైన మీసాల రాజారావు ఎంపిక వంగవీటి మోహన రంగ కులరహిత తత్త్వానికి ఓ తార్కాణం.
లక్షలాదిమంది ప్రజలను సమీకరించి కాపునాడు పేరుతో విజయవాడ వేదికగా భారీ బహిరంగ సభకు వంగవీటి రంగా సన్నాహాలు ప్రారంభించి 1988 జులై 10న సమావేశ తేదీని ప్రకటించారు. ఆ సభ నిలవరించే ఉద్దేశ్యంతో నాటి తెలుగు దేశం ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించింది.  అయినా సభ ఆగలేదు. రంగా పిలుపే ప్రభంజనంగా ప్రభుత్వ నిర్భంధాలను లెక్క చేయకుండా జనం లక్షలాదిగా... ఆ మధ్య తునిలో జరిగిన సభ లాగానే హాజరై విజయవంతం చేశారు. ఆ రోజున జైలులో ఉన్న రంగా... సభాస్థలి వద్దకు ఒక పూలకిరీటాన్ని పంపి కాపునాడు నేత ముద్రగడను పట్టాభిషిక్తుడిని చేయించారు. ప్రలోభాలకు లొంగక, పదవుల కోసం ప్రాకులాడకుండా జాతి కోసం ప్రాణ త్యాగం చేయటానికి వెనకాడని ముద్రగడ మనస్తత్వాన్ని రంగా అప్పుడే గ్రహించారు. చాలా తక్కువ పరిచయంతోనే రంగా తన చుట్టూ ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలరు అనే దానికి  ఇదొక ఉదాహరణ.
ప్రజాహితానికే పెద్ద పీట
1987లో గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు విజయవాడ నుండి నిత్యావసర వస్తువులను,  దుస్తులను సేకరించి ప్రభుత్వ సహాయానికి పదింతలు మిన్నగా సాయమందిచారు మోహన రంగ. ఇది ప్రజాహిత కార్యక్రమాల పట్ల ఆయన చూపిన చొరవకు ఓ ఉదాహరణ మాత్రమే.  గుంటూరు జిల్లాలోని నీరుకొండ అనే దళిత గ్రామంపై  1987  జూలైలో అగ్ర వర్ణాల వారు   దాడి చేసి ఆస్తులకు, ప్రాణాలకు హాని కల్గించిన సందర్భములో రంగా దళితుల పక్షాన నిలబడి నిత్యావసర వస్తువులను సేకరించి, పంపిణి చేసి వారికి ఆత్మ స్థైర్యాన్ని కలిగించారు. అలానే అనేక సందర్భాలలో ముంపుకు గురైన కృష్ణలంక వాసులను అనుక్షణం ఆదుకుంటూ అక్కడ కరకట్ట నిర్మాణానికీ ఆద్యుడయ్యారు. అంతేకాదు,  పౌర హక్కులను కాపాడే విషయంలోనూ రంగ ముందుండే వారు. పీటల నరసింహారావు అనే రిక్షా కార్మికుడు విజయవాడ పోలీస్ లాకప్ లో చనిపోయిన విషయం తెలుసుకున్న రంగ,  అదే సమయంలో అధికార పర్యటన లో భాగంగా విజయవాడ వచ్చిన అప్పటి హోమ్ మంత్రి కోడెల శివ ప్రసాద్ ను నడిరోడ్డు మీద స్థానిక ప్రజలతో కలిసి నిలదీశారు. ఈ విషయమై మాట్లాడటానికి గెస్ట్ హౌస్ కు రమ్మని కోడెల సూచించగా, ‘నాకు గెస్ట్ హౌస్ రాజకీయాలు తెలియవు. తక్షణ న్యాయం చేయాల్సిందే’ అని పట్టుబట్టారు.  ‘అపాయింట్ మెంట్ లేకుండా,  పర్మిషన్ లేకుండా రభస చేస్తున్నావు. నీ చర్య ఇల్లీగల్’  అని హోమ్ మినిస్టర్ హెచ్చరిస్తే… ‘మీ శాఖలోని అధికారులు ఒక మనిషి ప్రాణం తీస్తే అది మీకు లీగల్ గా కనిపిస్తోందా?’  అంటూ ఎదురు ప్రశ్నించిన ధీశాలి రంగ. చిన్న చిన్న సంఘటనలను కూడా తమకు అనుకూలంగా మలచుకుని అధికార గణానికి దగ్గర కావడం కోసం ఉద్యమాలను తాకట్టు పెట్టే రాజకీయ నాయకులు బుద్ధి తెచ్చుకోవాల్సిన సంఘటన ఇది. అప్పటి పరిస్థితులలో రంగ కమ్యూనిస్టులతో ఘర్షణలు పడినా,  ఆయనలో పెట్టుబడిదారులతో తగవు పడి పేదలకు అండగా నిలిచే కమ్యూనిస్టు భావాలే మెండుగా ఉండేవి.
రంగ మరణానికి నాలుగు రోజుల ముందు  1988  డిసెంబర్  22వ తేదీ సాయంత్రం ప్రభుత్వ అధికారులకు,  క్రీస్తు రాజపురం వాసులకు ఇళ్ళ స్థలాల విషయమై వివాదం జరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ విషయం తెలుసుకున్న రంగ ఆ ప్రాంత ప్రజలను కలవాలని తన ఇంటి నుండి బయలుదేరుతుంటే,  పోలీసులు అడ్డుకుని అక్కడకు వెళ్ళేందుకు అనుమతించలేదు. ప్రజా ప్రతినిధి అయిన తనకు,  తనను గెలిపించిన ప్రజలను కలుసుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదని పోలీస్ అధికారులతో రంగ వాదించారు. క్షణాలలో అక్కడకు చేరుకున్న ప్రజలు పోలీసులపై తిరుగుబాటుకు సిద్ధం కాగా వారిని వారించి,  పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వవలసిందేనని,  తనకు కుదించిన భద్రతను పెంచాల్సిందేనని నడిరోడ్డు మీదనే రంగ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. మర్నాడు ఉదయం వరకూ పోలీసులు తనను అడ్డగించిన చోటనే దీక్షను కొనసాగించారు. అయితే…  సన్నిహితుల సలహా మేరకు  23వ తేదీ ఆయన తన స్వగృహానికి   దగ్గరగా దీక్షా శిబిరాన్ని మార్చారు. అక్కడే  26వ తేదీ తెల్లవారు ఝామున వంగవీటి మోహన రంగ హత్య కావించబడ్డారు. అశనిపాతం లాంటి ఈ వార్తతో హతాశయులైన జనం తండోపతండాలుగా సంఘటన స్థలికి తరలి వచ్చారు. లక్షలాది ప్రజలు ఘనంగా నివాళులు అర్పిస్తుండగా రంగ అంతిమయాత్ర సాగింది.
    వంగవీటి మోహన రంగ జీవన గమనంలోని కీలకమైన ఘట్టాలను తరచి చూస్తే…  ఇవేవీ కేవలం ఒక కులాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవో,  ఒక కుల ప్రయోజనాల ఆశించి చేసినవో కాదనే విషయం అవగతమౌతుంది. ఆయన  సాగించిన ధీరోదాత్త ఆందోళనలు  కేవలం ఆయన ఒక్కడివల్లనో,  ఒక కులస్థుల ప్రోత్సాహంతోనో జరిగినవీ కాదు. కుల మతాలకు అతీతంగా ప్రజలు,  ప్రాణ త్యాగాలకు వెరవని సహచరులు అందించిన సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ఇవాళ రంగ జయంతి,  వర్థంతి కార్యక్రమాలలో కాపేతరులు,  కాంగ్రేసేతరులే కాదు... మరీ ముఖ్యంగా ఆయనను ప్రత్యర్థిగా భావించిన తెలుగుదేశం పార్టీ మంత్రులు సైతం పాల్గొంటున్నారు. రంగ వ్యక్తిత్వాన్ని కొనియాడుతున్నారు. స్వార్థరహిత పోరాటాల ప్రభావం భౌతిక మరణంతో ఆగిపోదని,  జన హృదయాలలో సుస్థిరంగా ఉంటుందని రంగాకి ఇవాళ లభిస్తున్న ఆదరణతో మరోసారి తేటతెల్లమైంది.
    అలాంటి వ్యక్తి జీవితాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ వెండితెరపై ఏ మాత్రం అర్థవంతంగా చూపలేదన్నది వాస్తవం. దేవినేని మురళి హత్యకు రంగానే పధక రచన చేసినట్లు చూపిన వర్మ, రంగా హత్య వివరాలను మాత్రం అమ్మవారినే అడగాలని పేర్కొని దేవినేని కుటుంబం పట్ల తనకు ఉన్న పక్షపాత ధోరణిని చూపారు. దేవినేని గాంధీ హత్యానంతరం వెంటనే ప్రతీకార దాడి జరిగి బస్ లో రంగా అనుయాయులలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యారు. ఆ తర్వాత నగర పెద్దలు రాజీ చేసిన సంగతిని వక్రీకరించి గాంధీ హత్యకు గురి అయినా... అతని పెద్ద సోదరుడు శాంతిని కోరుకుని రాజీకి అంగీకరించినట్లు చూపారు. పెద్దల రాజీని తూట్లు పొడుస్తూ 1987లో దేవినేని వర్గం రాధా సమకాలీకుడైన ముత్యాల శోభనాద్రిని చంపి మరల ప్రశాంతంగా ఉన్న బెజవాడలో కక్షలు కార్పణ్యాలకు నాంది పలికారనే విషయాన్ని వర్మ ధైర్యంగా తెరకు ఎక్కించలేక పోయారు. గుణదలలోని ముత్యాల సోదరుల ప్రస్తావన లేకుండా నెహ్రూ, రంగా మధ్య వర్గ పోరును చూపడం ప్రధానమైన వాస్తవాలను కప్పిపుచ్చడమే అవుతుంది. మరీ ముఖ్యంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అందుకుగాను విజయవాడలో వచ్చిన ప్రజా ఆందోళనలు, వాటిలో రంగా ప్రమేయం గురించిన విషయాలను మరుగున పరచి కేవలం ఆయన జీవితాన్ని హత్య రాజక, ీయాలకే పరిమితం చేసి చూపిన వర్మ ప్రయత్నం ఏ మాత్రం హర్షణీయం కాదు.
                                    
                                      
.
#please_share .

0 comments:

Post a Comment

Seo training videos in telugu

C++ training videos in telugu

Php Training videos in telugu

Digital marketing training in telugu

Wordpress training videos in telugu

Blogger Training videos in telugu

R language in telugu

Sql in telugu

AngularJs in telugu

Html5 in telugu

Jquery in telugu

javascript in telugu

html and css

vlrlive. Powered by Blogger.